

డీజిల్‌లో ఇథనాల్ కలపాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేసింది. ఇథనాల్ కలపడం వల్ల డీజిల్ ఫ్లాష్ పాయింట్ గణనీయంగా తగ్గుతున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఆర్‌అండ్‌డీ కేంద్రాలు, గుర్తింపు పొందిన ప్రయోగశాలలు, ఆటోమొబైల్ సంస్థలు, ఇతర సాంకేతిక సంస్థల సహకారంతో ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
ఫ్లాష్ పాయింట్ అంటే ఇంధనం నుంచి వెలువడే ఆవిరి బాహ్య జ్వాల లేదా నిప్పురవ్వ తగిలినప్పుడు క్షణకాలం మండగలిగే అత్యల్ప ఉష్ణోగ్రత. ఫ్లాష్ పాయింట్ తగ్గడం వల్ల ఇంధనం నిల్వ, రవాణా, నిర్వహణ సమయంలో భద్రతాపరమైన ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం E20 కంటే ఎక్కువ ఇథనాల్ కలిగిన పెట్రోల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. భవిష్యత్తులో E20కి మించి మిశ్రమాన్ని పెంచాలంటే శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనాలు, పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
E20 పెట్రోల్ వినియోగంపై కేంద్రం సానుకూలంగా ఉంది. ARAI, SIAM, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం తదితర సంస్థలు నిర్వహించిన పరీక్షలు, ఫీల్డ్ ట్రయల్స్‌లో ఇంజిన్ జీవితకాలం, డ్రైవింగ్ పనితీరు, స్టార్టింగ్, తుప్పు, ఇంధన అనుకూలత, మైలేజీ వంటి అంశాలను పరిశీలించినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఉన్న పాత వాహనాల్లో ఇథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల విస్తృత స్థాయిలో ఇంజిన్ వైఫల్యాలు లేదా బ్రేక్‌డౌన్‌లు జరిగినట్లు నిర్ధారించే ఆధారాలు లేవని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!