

భారతదేశాన్ని ప్రపంచ స్థాయి రసాయన తయారీ, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం, పారిశ్రామిక రంగం కీలక చర్చలు జరిపాయి. న్యూఢిల్లీలో కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా అధ్యక్షతన సీఈఓల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. రసాయన రంగ అభివృద్ధికి అవసరమైన ప్రాధాన్యతలు, పెట్టుబడుల అవకాశాలు, సాంకేతిక ఆవిష్కరణలు, దేశీయ తయారీ సామర్థ్యాల విస్తరణ తదితర అంశాలపై ప్రభుత్వ ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు చర్చించారు. ప్రభుత్వ విధానాలు, పరిశ్రమ అవసరాల మధ్య సమన్వయంతో దీర్ఘకాలిక వృద్ధికి రోడ్‌మ్యాప్ రూపొందించాల్సిన అవసరాన్ని సమావేశంలో ప్రస్తావించారు.
2040 నాటికి భారత రసాయన రంగాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యంగా చర్చలు సాగాయి. దేశీయ తయారీని పెంచడం, అధునాతన సాంకేతికతను ప్రోత్సహించడం, పరిశోధన–ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రపంచ రసాయన సరఫరా గొలుసులో భారత్ కీలక పాత్ర పోషించేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఎగుమతులను విస్తరించడం వంటి అంశాలపైనా దృష్టి సారించారు. ప్రపంచ రసాయన తయారీ రంగంలో భారత్‌ను మరింత పోటీతత్వ దేశంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం–పరిశ్రమ భాగస్వామ్యం కీలకమని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!