

భారతదేశ భవిష్యత్తులో సెమీకండక్టర్లు కీలక పాత్ర పోషించనున్నాయని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. దేశంలో అందుబాటులో ఉన్న ప్రతిభావంతులు, భారీ దేశీయ మార్కెట్, అంతర్జాతీయ భాగస్వామ్యాలు ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థలో భారత్‌ను కీలక కేంద్రంగా నిలబెడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కృత్రిమ మేధ విస్తరణ, ముడి సరుకుల కొరత, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాల నేపథ్యంలో వ్యాపార సంస్థలు దీర్ఘకాలిక స్థిరత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇంధన అవసరాలను సమర్థంగా నిర్వహించడంతో పాటు అవసరమైన సాంకేతికతను పొందేందుకు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు కీలకమని పేర్కొన్నారు. సెమీకండక్టర్లపై టాటా గ్రూపు పెట్టుబడులను స్వల్పకాలిక ఆర్థిక ఫలితాలతో కాకుండా వాటి వ్యూహాత్మక ప్రాముఖ్యత, దీర్ఘకాలిక ప్రయోజనాల ఆధారంగా అంచనా వేయాలని స్పష్టం చేశారు.
మార్కెట్ గిరాకీ, ఆర్థిక సాధ్యాసాధ్యాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే అత్యాధునిక చిప్ తయారీ సాంకేతికతలను ఎంచుకోవాలని చంద్రశేఖరన్ సూచించారు. పెట్టుబడులు వాణిజ్యపరంగా లాభదాయకంగా ఉండటంతో పాటు దీర్ఘకాలంలో స్థిరమైన ఉపాధిని కల్పించాలని తెలిపారు. ఈ నేపథ్యంలో టాటా ఎలక్ట్రానిక్స్ తైవాన్‌కు చెందిన పవర్‌చిప్ సెమీకండక్టర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ భాగస్వామ్యంతో గుజరాత్‌లోని ధోలేరాలో సుమారు రూ.91,000 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. వాహనాలు, మొబైల్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధ, పారిశ్రామిక రంగాలకు అవసరమైన చిప్‌లను ఇక్కడ తయారు చేయనున్నారు. మరోవైపు, అస్సాంలో రూ.27,000 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ అసెంబ్లీ, పరీక్షల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తోంది. అధునాతన తయారీ, ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ సాంకేతికతల్లో తన కార్యకలాపాలను విస్తరించడం టాటా గ్రూపు దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!