

ప్రపంచ ఉత్పాదకత రంగంలో భారత్ పాత్ర రోజురోజుకూ పెరుగుతోందని మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సరఫరా వ్యవస్థల్లో మార్పుల దిశగా కదులుతోందని, తయారీ విస్తరణ కోసం దేశాలు స్థిరత్వం, ఉత్పాదక సామర్థ్యం, ప్రతిభ, విశ్వసనీయ భాగస్వాములను కోరుకుంటున్నాయని అన్నారు. ఈ అన్ని అంశాలను అందించే నమ్మకమైన పరిష్కారంగా భారత్ ఎదుగుతోందని ఎంఅండ్‌ఎం 80వ వార్షిక సర్వసభ్య సమావేశంలో పేర్కొన్నారు. గత దశాబ్దంలో మహీంద్రా సంస్థకు లభించిన పేటెంట్ల సంఖ్య 56 నుంచి 1,300కు పైగా పెరిగిందని తెలిపారు. నాగ్‌పుర్‌లో రూ.15,000 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు వెల్లడించారు.
మహీంద్రా అండ్ మహీంద్రా జూన్ త్రైమాసికంలో అద్భుత ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. కంపెనీ నికర లాభం రూ.5,455 కోట్లకు చేరి, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 34 శాతం వృద్ధి సాధించింది. ఆదాయం రూ.45,529 కోట్ల నుంచి రూ.58,188 కోట్లకు పెరిగింది. వాహన, వ్యవసాయ విభాగాలు మెరుగైన పనితీరు కనబరిచాయని కంపెనీ తెలిపింది. మొత్తం వాహన విక్రయాలు 23 శాతం పెరిగి 3.04 లక్షలకు చేరుకోగా, ఎస్‌యూవీ విక్రయాలు 1.75 లక్షల మైలురాయిని అధిగమించాయి. టెక్ మహీంద్రా, మహీంద్రా లాజిస్టిక్స్, ఆర్థిక సేవల విభాగాల్లోనూ వృద్ధి నమోదైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!