

వినాయక చవితి వేళ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ.2 వేల వరకు చేసే యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఎలాంటి ఛార్జీలు విధించకూడదని ఆదేశించింది. అలాగే రూపే డెబిట్ కార్డుల ద్వారా రూ.2 వేల వరకు చేసే చెల్లింపులపైనా ఛార్జీలు వసూలు చేయడాన్ని నిషేధించింది. ఈ మేరకు సెప్టెంబర్ 14 అర్ధరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని సెక్షన్ 10ఏ కింద ఈ మార్పులను నోటిఫై చేసినట్లు పేర్కొంది.
కొత్త నోటిఫికేషన్ ప్రకారం.. రూ.2 వేల వరకు చేసే యూపీఐ, రూపే డెబిట్ కార్డు చెల్లింపులపై బ్యాంకులు, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదు. ఈ నిబంధన డబ్బులు పంపేవారితో పాటు స్వీకరించేవారికీ వర్తిస్తుంది. చిన్న వ్యాపారులు, దుకాణదారులకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించనుంది. ప్రస్తుతం యూపీఐ ద్వారా రూ.2 వేలకుపైగా చెల్లింపులపైనా వినియోగదారుల నుంచి నేరుగా ఛార్జీలు వసూలు చేయడం లేదు. భవిష్యత్తులో వ్యాపారులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించినా, అది భారీ లావాదేవీలకు మాత్రమే పరిమితం అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!