

దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్ల ప్రవేశంపై భారతీయ రిజర్వు బ్యాంకు మరోసారి కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని, అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. పాలిమర్ నోట్ల అమలుపై సాధ్యాసాధ్యాలను అంచనా వేయడానికి త్వరలో పైలట్ ప్రాజెక్టు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పాలిమర్ నోట్లు ప్రత్యేక పాలీప్రొపిలీన్ పదార్థంతో తయారవుతాయి. ఇవి తడి, దుమ్ము, ఇతర వాతావరణ ప్రభావాలకు తట్టుకుని ఎక్కువకాలం నిలుస్తాయి. సాధారణ కాగితపు నోట్లు 2 నుంచి 7 సంవత్సరాలు మాత్రమే ఉపయోగంలో ఉండగా, పాలిమర్ నోట్లు వాటికంటే 4 నుంచి 5 రెట్లు ఎక్కువ కాలం మన్నే అవకాశం ఉంది. అలాగే అధునాతన భద్రతా లక్షణాల కారణంగా నకిలీ నోట్ల తయారీని కూడా సమర్థంగా అరికట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నప్పటికీ దేశంలో నగదు వినియోగం తగ్గడం లేదు. 2026 మార్చి నాటికి చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ ₹41.68 లక్షల కోట్లకు చేరగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 12 శాతం ఎక్కువ. ప్రజల చేతుల్లో ఉన్న నగదు ₹40.52 లక్షల కోట్లు, అంటే మొత్తం కరెన్సీలో 97 శాతం. 2024–25లో 2,380 కోట్ల పాడైన నోట్లను ఉపసంహరించి ధ్వంసం చేయాల్సి వచ్చింది. అదే కాలంలో నోట్ల ముద్రణ వ్యయం ₹6,373 కోట్లకు పెరిగింది. 2014లో ఐదు నగరాల్లో ₹10 విలువైన 100 కోట్ల పాలిమర్ నోట్ల ప్రయోగం జరిగినప్పటికీ, అది అమలులోకి రాలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!