

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ E20 పెట్రోల్‌కు సంబంధించి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బాంబే హైకోర్టును ఆశ్రయించారు. E20 ఇంధన విధానం వల్ల తన కుటుంబానికి వ్యక్తిగతంగా లాభం చేకూరిందని అసత్య ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం (జూలై 27) ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు మెటా, గూగుల్‌తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలపై పరువు నష్టం దావా దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.
గడ్కరీ తరఫు న్యాయవాది వాదిస్తూ, పరువు నష్టం కలిగించే కంటెంట్ ముంబైలో కూడా అందుబాటులో ఉండటంతో ఈ కేసును విచారించే అధికారం హైకోర్టుకు ఉందని తెలిపారు. దీనిని అంగీకరించిన న్యాయస్థానం దావా దాఖలు చేసేందుకు అనుమతి మంజూరు చేసింది. AI సాయంతో తన పేరు, ఫోటో, గొంతును ఉపయోగించి డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు కంటెంట్ రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని గడ్కరీ ఆరోపించారు.
ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన విమర్శలకు తాను వ్యతిరేకం కాదని, కానీ తప్పుడు ఆరోపణలు, డీప్‌ఫేక్ ప్రచారంపై మాత్రమే చర్యలు కోరుతున్నానని గడ్కరీ స్పష్టం చేశారు. E20 అనేది 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమంతో తయారయ్యే ఇంధనం. ముడి చమురు దిగుమతులను తగ్గించడం, కాలుష్య నియంత్రణ, దేశీయ జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం కోసం కేంద్రం దీనిని ప్రవేశపెట్టగా, పాత వాహనాలపై దీని ప్రభావంపై కొందరు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!