

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ సంస్థ ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ కలిసి ప్రతిపాదిత నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ ఐపీఓ ద్వారా మొత్తం 1 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తున్నాయి. ఇందులో ఎస్‌బీఐ 0.65 శాతం, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్ 0.35 శాతం వాటాను విక్రయించనున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐకి 3.23 శాతం, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌కు 4.33 శాతం వాటా ఉంది. ప్రతిపాదిత రూ.30,000 కోట్ల ఎన్‌ఎస్‌ఈ పబ్లిక్ ఇష్యూలో ఈ వాటా విక్రయం చోటు చేసుకునే అవకాశం ఉంది.
ఇతర అనుబంధ సంస్థలకు సంబంధించి సమీప భవిష్యత్తులో ఎలాంటి నగదీకరణ ప్రణాళికలు లేవని సీఎస్ శెట్టి స్పష్టం చేశారు. గత నెలలో విదేశీ భాగస్వామ్య సంస్థ అముండితో కలిసి ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్‌లో సుమారు 10 శాతం వాటాను విక్రయించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. మరోవైపు, ప్రస్తుత త్రైమాసికంలో ఎస్‌బీఐ హౌసింగ్ రుణాల విభాగం మార్ట్‌గేజ్ పోర్ట్‌ఫోలియో రూ.10 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించే అవకాశం ఉందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!