

అమెరికాకు చెందిన బహుళజాతి వాహన తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్ కంపెనీ ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడానికి కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఆటోమేటెడ్ నాణ్యతా వ్యవస్థలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, గతంలో పనిచేసిన అనుభవజ్ఞులైన ఇంజినీర్లను మళ్లీ నియమించుకుంటోంది. గత మూడు సంవత్సరాల్లో సుమారు 350 మంది పూర్వ ఉద్యోగులను తిరిగి తీసుకున్నట్లు సమాచారం. యాంత్రీకరణపై అతిగా ఆధారపడటం వల్ల ఇంజినీరింగ్ అనుభవ విలువను తగ్గించి చూసినట్టు కంపెనీ సీఓఓ కుమార్ గల్హోత్రా పేర్కొన్నారు. ఏఐ సామర్థ్యాలను అధికంగా అంచనా వేసినట్టు వైస్ ప్రెసిడెంట్ చార్లెస్ పూన్ వెల్లడించారు.
ఇక మరోవైపు, భారతీయ కంపెనీలు ఏఐ వినియోగంపై దృష్టి పెడుతున్నాయి. టెక్ మహీంద్రా, మారుతీ సుజుకీ ఇండియా సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐను మరింతగా వినియోగించేందుకు భాగస్వామ్యాలు కుదుర్చుకుంటున్నాయి. టెక్ మహీంద్రా ‘పర్ప్లెక్సిటీ’ ప్లాట్ఫామ్ ద్వారా సేల్స్ బృందాలకు ఆధునిక టూల్స్ అందించనుండగా, మారుతీ సుజుకీ ఐదు అంకుర సంస్థలతో కలిసి వినియోగదారుల అనుభవాలను మెరుగుపరచేందుకు ప్రయత్నిస్తోంది. అదేవిధంగా, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఫిన్లాండ్కు చెందిన నెస్టే సంస్థతో ఐటీ సేవలు, ఏఐ ఆధారిత మార్పుల కోసం ఒప్పందం కుదుర్చుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!