

విద్యార్థుల సమస్యలు, జూలై 20న నిర్వహించిన ‘చలో పార్లమెంట్’ సందర్భంగా జరిగిన పోలీసుల లాఠీచార్జ్, బలప్రయోగంపై పార్లమెంట్‌లో పూర్తిస్థాయి చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపింది. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేస్తారని వెల్లడించింది. చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించకుండా హోంమంత్రి సమాధానాన్ని ప్రశాంతంగా వినాలని, పార్లమెంట్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రభుత్వం కోరింది.
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో జూలై 20న ‘చలో పార్లమెంట్’కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ ప్రయోగించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పోలీసుల చర్యలపై అమిత్ షా పార్లమెంట్‌లో సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో మూడు వారాలుగా ఉభయ సభల్లో ప్రతిష్టంభన కొనసాగింది. తాజాగా ప్రభుత్వం చర్చకు అంగీకరించడంతో పార్లమెంట్‌లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!