

మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహ్మద్ అధినేత మసూద్ అజార్ పాకిస్థాన్‌లోనే ఉన్నాడని భారత్ పదేపదే ఆరోపిస్తున్నప్పటికీ.. ఇస్లామాబాద్ మాత్రం ఆ వాదనను అంగీకరించడం లేదు. తాజాగా, మసూద్ పాకిస్థాన్‌లో లేడనే వాదనకు బలం చేకూర్చేలా ఆ దేశ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్‌ఐఏ) అతడి పేరును ‘మోస్ట్ వాంటెడ్’ ఉగ్రవాదుల రెడ్ బుక్‌లో చేర్చింది. అతడి ఆచూకీ తెలిపిన వారికి 70 లక్షల పాకిస్థానీ రూపాయల బహుమతిని ప్రకటించింది. ఐదేళ్ల క్రితం ఇదే విషయంపై 50 లక్షల పాకిస్థానీ రూపాయల రివార్డును ప్రకటించిన పాక్.. ఇప్పుడు మరో 20 లక్షలు పెంచింది. అక్టోబర్‌లో జరగనున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) సర్వసభ్య సమావేశానికి ముందు ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ సమాజానికి చూపించి, ఒత్తిళ్లను తగ్గించుకునేందుకే పాక్ ఈ ప్రకటన చేసి ఉండొచ్చని భారత నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మసూద్ అఫ్గానిస్థాన్‌లో తలదాచుకున్నాడని పాక్ 2021 నుంచి చెబుతున్నప్పటికీ.. ఆ వాదనను అఫ్గాన్ తిరస్కరించింది. మరోవైపు, మసూద్ పాకిస్థాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని నవాబ్‌షాలో ఉన్నట్లు భారత నిఘా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఎఫ్‌ఐఏ రెడ్ బుక్‌లో 26/11 ముంబయి ఉగ్రదాడులతో సంబంధమున్న 19 మంది పేర్లు కూడా ఉన్నాయి. అయితే, వీరిలో పలువురు పాక్‌లోనే ఉన్నారని, అంతర్జాతీయ ఒత్తిడిని తప్పించుకునేందుకు వారిని ‘మోస్ట్ వాంటెడ్’ జాబితాలో చేర్చారని భారత్ ఆరోపిస్తోంది. మసూద్ అజార్ భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడులకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 1995లో భారత్ అతడిని అరెస్టు చేయగా.. 1999లో ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి అతడిని విడిపించుకున్నారు. అనంతరం అతడు జైషే మహ్మద్‌ను స్థాపించాడు. 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబయి దాడుల్లోనూ అతడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2019లో ఐక్యరాజ్యసమితి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!