

వైద్య, ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు చేపట్టిన ‘సంజీవని ప్రాజెక్టు’ను జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అమలు చేస్తే వైద్య సేవల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగంలో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని సూచించారు. ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్య, ఆరోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని సీఎం ఆదేశించారు.
సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు అధికారులు 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో బేస్‌లైన్ అధ్యయనం, డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ, సర్టిఫికేషన్, జాతీయ, రాష్ట్ర స్థాయి పోర్టల్స్‌తో అనుసంధానం వంటి చర్యలు ఉన్నాయి. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. సమీక్షా సమావేశంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ, టాటా ఎండీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!