

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి సంస్థ మరియు కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేపీసీఎల్) సంయుక్త భాగస్వామ్యంతో పనిచేయాలని కర్ణాటక ప్రభుత్వానికి ప్రతిపాదించారు. బెంగళూరులో కర్ణాటక ఇంధన శాఖ మంత్రి కె.జె. జార్జ్‌తో సమావేశమైన ఆయన, రెండు రాష్ట్రాల మధ్య ఇంధన రంగ అభివృద్ధి, బొగ్గు సరఫరా, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడిపై చర్చించారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో బొగ్గు తవ్వకాల కోసం సింగరేణితో కేపీసీఎల్ కలిసి పనిచేయాలని భట్టి సూచించగా, జార్జ్ సానుకూలంగా స్పందించారు. కర్ణాటకలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తెలంగాణ బొగ్గును నిరంతరం సరఫరా చేయాలని జార్జ్ కోరగా, భట్టి సానుకూలంగా స్పందించారు.
అనంతరం రాయచూరు జిల్లా దేవదుర్గ్ తాలూకాలోని లింగదహళ్లి గ్రామంలో సింగరేణి ఆధ్వర్యంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ కార్యక్రమాన్ని భట్టి ప్రారంభించారు. ఈ ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజాలు సమృద్ధిగా లభిస్తే యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ టెండర్ల ద్వారా దేవదుర్గ్ బ్లాక్ అన్వేషణ హక్కులను సింగరేణి దక్కించుకున్నట్లు గుర్తుచేశారు. త్వరలో సింగరేణి కార్యాలయం, హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన భట్టి, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక ప్రజల మధ్య ఉన్న సన్నిహిత బంధాన్ని ప్రస్తావించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!