

ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహక ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇందులో భాగంగా 12 నగరపాలక సంస్థలు, 29 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ప్రచురించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఫారం-1 నోటీసుతో పాటు వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాలను సెప్టెంబర్ 22న ప్రకటించనున్నారు. 2026 జనవరి 1ని అర్హత తేదీగా పరిగణించి, తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా వీటిని రూపొందించాలని ఎస్‌ఈసీ సూచించింది.
రాష్ట్రంలోని 17 నగరపాలక సంస్థల్లో విజయనగరం కార్పొరేషన్‌లో వార్డుల పునర్విభజన ముందుగానే పూర్తవడంతో సెప్టెంబర్ 3న ఓటర్ల జాబితా ప్రచురణ పూర్తయింది. అలాగే 106 పురపాలక, నగర పంచాయతీల్లో డిలిమిటేషన్ పూర్తయిన 58 చోట్ల కూడా అదే తేదీన జాబితాలను ప్రకటించారు. మిగిలిన 12 కార్పొరేషన్లు, 29 పురపాలక, నగర పంచాయతీల్లో వార్డుల పునర్విభజన సెప్టెంబర్ 14 నుంచి 17 మధ్య పూర్తికానుంది. దీంతో పురపాలక శాఖ విజ్ఞప్తిని పరిశీలించిన ఎస్‌ఈసీ.. సెప్టెంబర్ 22ను ఓటర్ల జాబితాల ప్రచురణ తేదీగా ఖరారు చేసింది. తాజా జాబితాల ప్రచురణతో మేయర్లు, పురపాలక ఛైర్మన్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారుకు మార్గం సుగమం కానుంది. ఈ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత కమిషనర్లను ఆదేశించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!