

యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హూతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రతరం కావడంతో సౌదీ అరేబియా అప్రమత్తమైంది. యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో హూతీలు తమ ఆధిపత్యాన్ని పెంచుకుంటూ వ్యూహాత్మకమైన బాబ్ ఎల్ మండెబ్ ప్రాంతంపై ఒత్తిడి పెంచుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో నౌకాయానం, సౌదీ చమురు ఎగుమతులపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి సాంకేతిక, నిఘా సహాయాన్ని సౌదీ కోరినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల భద్రతా అధికారుల మధ్య పరోక్ష చర్చలు జరిగినట్లు సమాచారం.
మరోవైపు సౌదీ అరేబియా, పాకిస్థాన్, తుర్కియే మధ్య ఇటీవల కుదిరిన మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపైనా చర్చ మొదలైంది. హూతీల దాడులు సౌదీ భూభాగానికి విస్తరిస్తే ఒప్పందం అమల్లోకి రావచ్చని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గతంలో పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్ విదేశాంగ శాఖ మాత్రం ప్రస్తుతం ఎలాంటి తక్షణ సైనిక చర్యపై చర్చ జరగలేదని, ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేసేందుకు మరిన్ని వ్యవస్థలు, విధానాలు ఏర్పాటు చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. దీంతో హూతీల ముప్పును ఎదుర్కొనేందుకు సౌదీ ప్రత్యామ్నాయ అంతర్జాతీయ మద్దతు మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!