

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన, ఇది ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి ‘రన్‌వే’, యువత భవిష్యత్తుకు ‘లాంచ్‌ప్యాడ్’గా మారుతుందని అన్నారు. రాష్ట్రంలో రూ.18 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. విశాఖ ఎకనమిక్ రీజియన్‌ను ఆసియాలో ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, విమానాశ్రయం, సెమీకండక్టర్ యూనిట్ వంటి ప్రాజెక్టులు ఆ దిశలో కీలక అడుగులని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధి వేగంగా పెరుగుతున్నాయని ప్రధాని ప్రశంసించారు. గూగుల్ సహా అంతర్జాతీయ సంస్థలు ఏఐ, క్లౌడ్, డేటా సెంటర్, సెమీకండక్టర్ రంగాల్లో భారీ పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రాన్ని సాఫ్ట్‌వేర్ హబ్‌తో పాటు తయారీ రంగంలోనూ అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. విమానయాన, రైల్వేలు, హైవేలు, పోర్టులు, ఫార్మా పార్కులు, హరిత ఇంధన ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలబెట్టాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!