

ఉత్తరాంధ్ర ప్రగతికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. జీఎంఆర్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లో ఆగస్టు 17 అర్ధరాత్రి నుంచే విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. తొలి వాణిజ్య సర్వీసుగా స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానం సింగపూర్‌కు బయల్దేరింది. సోమవారం ఉదయం 6.45 గంటలకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి జీఎంఆర్ ప్రతినిధులు, జిల్లా అధికారులు, విమానాశ్రయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తొలి వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి ప్రారంభించారు.
భోగాపురం నుంచి హైదరాబాద్, బెంగళూరు, దిల్లీ, ముంబయి, చెన్నై, తిరుపతి, కోల్‌కతా తదితర నగరాలకు విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. సింగపూర్, అబుధాబి వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు కూడా సర్వీసులు కొనసాగనున్నాయి. తొలిరోజు సుమారు 31 విమాన రాకపోకలు ఉండగా, వేలాది మంది ప్రయాణికులు ఈ విమానాశ్రయాన్ని వినియోగించనున్నారు. దీంతో ఇప్పటివరకు వాణిజ్య విమాన సేవలు అందించిన విశాఖపట్నం విమానాశ్రయం నుంచి కార్యకలాపాలు భోగాపురానికి పూర్తిగా మారాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!