

జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా పరిష్కార ప్రక్రియలో ఎన్‌సీఎల్‌టీ ఆమోదించిన రీపేమెంట్ ప్లాన్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కేసులో వెల్లడైన వివరాల ప్రకారం సుభాష్ చంద్రపై అంగీకరించిన అప్పుల క్లెయిమ్‌లు సుమారు రూ.22,006 కోట్లు ఉండగా, ఆమోదించిన చెల్లింపు ప్రణాళికలో కేవలం రూ.6.5 కోట్లు మాత్రమే ఉన్నాయి. అంటే రుణదాతలకు దక్కే రికవరీ దాదాపు 0.03 శాతం మాత్రమే కాగా, సుమారు 99.97 శాతం మొత్తానికి హెయిర్‌కట్ వచ్చినట్టవుతుంది.
ఈ రీపేమెంట్ ప్లాన్‌ను కొంతమంది రుణదాతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌కు సుమారు రూ.1,322 కోట్లు రావాల్సి ఉండగా, కేవలం రూ.38 లక్షలు చెల్లించే ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే రుణదాతలలో 80.81 శాతం మంది ఓటింగ్ ద్వారా ప్లాన్‌కు మద్దతు ఇవ్వడంతో ఎన్‌సీఎల్‌టీ దానిని ఆమోదించింది. సుభాష్ చంద్ర వ్యక్తిగత ఆస్తులను లిక్విడేషన్‌కు గురిచేస్తే రుణదాతలకు ఇంతకంటే తక్కువ మొత్తం మాత్రమే దక్కే అవకాశం ఉందన్న కారణంతో ఈ పరిష్కారానికి ఆమోదం లభించింది. అయితే భారీ కార్పొరేట్ రుణాల విషయంలో దివాలా చట్టాలు ఎలా పనిచేస్తున్నాయి, సాధారణ రుణగ్రహీతలతో పోలిస్తే బడా రుణగ్రహీతలకు వ్యవస్థలో ఎంత భిన్నమైన పరిస్థితులు ఎదురవుతున్నాయనే ప్రశ్నలు ఈ వ్యవహారంతో మరోసారి తెరపైకి వచ్చాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!