

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధికారిక కార్యక్రమాలు, పర్యటనల్లో ఆమె వెంట తరచూ కనిపించే ఆర్మీ అధికారి మేజర్ రిషభ్ సింగ్ సాంబ్యాల్ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించారు. రాష్ట్రపతి ఏడీసీగా విధులు నిర్వహించిన ఆయన తాజాగా సైన్యం నుంచి ముందస్తు పదవీ విరమణ చేశారు. సుమారు 12 ఏళ్ల సైనిక సేవ అనంతరం వ్యక్తిగత, కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్మీని వీడినట్లు సమాచారం. అయితే ఆయన రిటైర్మెంట్‌పై రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అధికారిక వివరణ వెలువడలేదు.
రిషభ్ సింగ్ 2014లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో చేరారు. మిలిటరీ స్టడీస్, డిఫెన్స్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ పొందిన ఆయన 4 పారా స్పెషల్ ఫోర్సెస్‌లో పనిచేశారు. ఈ సమయంలో ప్రతిష్ఠాత్మక ‘బలిదాన్ బ్యాడ్జ్’ను అందుకున్నారు. 2021 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కెప్టెన్‌గా జాట్ రెజిమెంట్ దళానికి నాయకత్వం వహించారు. అదే ఏడాది జాట్ రెజిమెంట్ ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్ ట్రోఫీని గెలుచుకోవడంతో రిషభ్ పేరు మార్మోగింది. అనంతరం 2023లో రాష్ట్రపతి ఏడీసీగా ఎంపికయ్యారు. రాష్ట్రపతి వెంట అధికారిక కార్యక్రమాల్లో కనిపిస్తూ, ప్రొటోకాల్, భద్రతా విధులను సమర్థంగా నిర్వహించడంతో సోషల్ మీడియాలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నెటిజన్లు ఆయనను ‘నేషనల్ క్రష్’ అని కూడా పిలిచారు. ఇప్పుడు ఆయన ఆకస్మికంగా ఆర్మీ నుంచి వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!