

బిహార్ వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ కుమార్ సిన్హా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ, బిహార్ మధ్య వ్యవసాయ రంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై చర్చించారు. తెలంగాణలో అమలవుతున్న వాతావరణ హెచ్చరికలు, క్రాప్ బుకింగ్, శాటిలైట్ ఆధారిత పంటల పర్యవేక్షణ, అగ్రిస్టాక్, యూరియా బుకింగ్ యాప్, కృత్రిమ మేధ ఆధారిత ‘కృషివాస్’ వంటి సాంకేతిక కార్యక్రమాలను మంత్రి తుమ్మల వివరించారు.
రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుభరోసా, రైతుబీమా, రుణమాఫీ, సన్న వడ్లకు బోనస్ తదితర పథకాల గురించి కూడా తుమ్మల వివరించారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా వరి, పత్తితో పాటు మొక్కజొన్న, కందులు, సోయాబీన్, మామిడి, ఎర్రమిరప, పసుపు, ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు బిహార్‌లో 91 శాతం మంది చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని, వ్యవసాయంపై 77 శాతం జనాభా ఆధారపడుతోందని మంత్రి విజయ్ కుమార్ సిన్హా తెలిపారు. ప్రత్యేక పంటల క్లస్టర్ల అభివృద్ధి, సాంకేతిక వినియోగం తదితర అంశాలను ఆయన వివరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!