

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో వస్తున్న మార్పులతో స్మార్ట్‌ఫోన్ వినియోగంలోనూ కొత్త శకం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం యాప్‌లను ఓపెన్ చేసి ఒక్కో పని చేయాల్సి వస్తుండగా.. ఇకపై ఏఐ ఏజెంట్లకు ఆదేశాలు ఇవ్వడం ద్వారా పనులన్నీ పూర్తి చేసుకునేలా కొత్త ఫోన్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ దిశగా పనిచేస్తున్న స్టార్టప్ సంస్థ సైక్లోన్ (Cyclon) ప్రత్యేకమైన ఏఐ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తోంది. 2026లో మాజీ ఆండ్రాయిడ్ ఇంజినీర్ థామస్ కీఫర్, ఎలక్ట్రానిక్స్ నిపుణుడు ఆడమ్ జినేబీ దీనిని స్థాపించారు. యూజర్లు వేర్వేరు యాప్‌లను తెరవాల్సిన అవసరం లేకుండా తమకు కావాల్సిన పనిని ఫోన్‌కు చెబితే ఏఐ ఏజెంట్లు వాటిని పూర్తి చేస్తాయి. ఉదాహరణకు గూగుల్ డ్రైవ్‌లో ఓ డాక్యుమెంట్‌ను వెతికి, దాని లింక్‌ను వాట్సాప్‌లో స్నేహితుడికి పంపి, ఆ తర్వాత అతడికి ఫోన్ చేయమని ఆదేశించవచ్చు. ఏదైనా సమాచారం అవసరమైతే ఏఐ యూజర్‌ను అడిగి తెలుసుకుని పనిని కొనసాగిస్తుంది.
ప్రస్తుతం సైక్లోన్ తన తొలి ఫోన్ల కోసం గూగుల్ పిక్సెల్ 8ఏ పరికరాలను ఉపయోగిస్తూ, వాటిలో సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తోంది. అమెరికాలో అర్హులైన వినియోగదారులకు ఈ ఫోన్‌ను 699 డాలర్లకు ప్రీ-ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించింది. 2027 రెండో త్రైమాసికంలో తొలి పరికరాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సైక్లోన్ ఓఎస్ చాలా ఆండ్రాయిడ్ యాప్‌లకు మద్దతు ఇస్తున్నప్పటికీ.. బ్యాంకింగ్, చెల్లింపుల యాప్‌లు, గూగుల్ సర్టిఫికేషన్ అవసరమయ్యే కొన్ని యాప్‌లు పనిచేయవు. ఈ ఫోన్‌లో ఏఐ ప్రాసెసింగ్ పూర్తిగా జరగదు. యూజర్ అభ్యర్థనలు, సందేశాలు, లొకేషన్, స్క్రీన్‌పై కనిపించే సమాచారం వంటి వివరాలు క్లౌడ్ ఆధారిత ఏఐ సేవలకు పంపబడతాయి. ఏఐ ఏజెంట్ మెమరీ మాత్రం ఫోన్‌లోనే నిల్వ ఉంటుంది. యూజర్లు తమకు నచ్చిన యాప్‌లకు ఏఐ యాక్సెస్‌ను నిలిపివేయవచ్చు. తమ డేటాను ఏఐ శిక్షణకు ఉపయోగించబోమని కంపెనీ చెబుతోంది. గూగుల్, క్వాల్‌కామ్, నథింగ్ వంటి సంస్థలు కూడా ఏఐ ఏజెంట్ల ఆధారిత సాంకేతికతపై దృష్టి సారిస్తుండటంతో భవిష్యత్తులో యాప్‌ల కంటే ఏఐ అసిస్టెంట్లే స్మార్ట్‌ఫోన్ వినియోగంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!