

తన డివైజ్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సామర్థ్యాలను మరింత విస్తరిస్తూ యాపిల్ సరికొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను తీసుకొస్తోంది. ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్, మ్యాక్ పరికరాల్లో వ్యక్తిగతీకరణ, వినియోగదారుల రోజువారీ పనులను సులభతరం చేసే ఫీచర్లకు ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా సిరి ఏఐ అసిస్టెంట్‌ను మరింత శక్తిమంతంగా తీర్చిదిద్దింది. ఫైళ్లను క్రమబద్ధీకరించడం, గతంలో సందర్శించిన ప్రదేశాలను గుర్తించడం, స్నేహితులతో ప్రణాళికలు రూపొందించడం వంటి క్లిష్టమైన పనులను సిరి ద్వారా చేయవచ్చు. ఆపిల్ మ్యూజిక్‌లో ప్లేలిస్ట్‌లు రూపొందించడం, సఫారిలో ట్యాబ్‌లను క్రమబద్ధీకరించడం, సందేశాలను షెడ్యూల్ చేయడం వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. మెయిల్, క్యాలెండర్, మ్యాప్స్, మెసేజెస్, ఫొటోస్, నోట్స్, రిమైండర్స్ సహా 16 యాప్‌లలో ఈ ఫీచర్లను పరీక్షించుకోవచ్చు. చైనీస్, వియత్నామీస్, టర్కిష్, నార్వేజియన్ భాషలకు కూడా సిరి బీటా మద్దతును విస్తరించింది.
యాపిల్ వాచ్ సిరీస్ 12, యాపిల్ వాచ్ అల్ట్రా 4లో ఆడియో ఇంటెలిజెన్స్ ఫీచర్లను అందిస్తోంది. లైవ్ రివైండ్ ద్వారా సంభాషణలో గత 15 సెకన్ల సమాచారాన్ని తిరిగి తెలుసుకోవచ్చు. సిరి రీక్యాప్ ఫీచర్ సంభాషణలకు సంబంధించిన ముఖ్యాంశాలను ఆటోమేటిక్‌గా సంక్షిప్తీకరిస్తుంది. ఐఫోన్‌లో పునరుద్ధరించిన హెల్త్ యాప్ ద్వారా వ్యక్తిగత ఆరోగ్య వివరాలు, హెల్త్ ఏజ్, కదలికల అంచనాలను తెలుసుకోవచ్చు. ఫిట్‌నెస్+ జిమ్ స్ట్రెంత్ ద్వారా వ్యక్తిగత లక్ష్యాలకు అనుగుణంగా నాలుగు వారాల వ్యాయామ ప్రణాళికలు అందుబాటులోకి రానున్నాయి. సఫారిలో వర్టికల్ ట్యాబ్స్, అడాప్టివ్ డార్క్ మోడ్ వంటి మార్పులు తీసుకొచ్చింది. స్టాండ్‌బై ఫీచర్‌ను మరిన్ని ఐఫోన్ మోడళ్లకు విస్తరిస్తుండగా, ఎంపిక చేసిన ఐప్యాడ్‌లలో సిరి, విజువల్ ఇంటెలిజెన్స్ సదుపాయాలను మెరుగుపరుస్తోంది. మరోవైపు యాప్ ఇంటెంట్స్, స్కిల్స్ ద్వారా డెవలపర్లకు సిరితో తమ యాప్‌లను అనుసంధానించే అవకాశాన్ని కల్పిస్తోంది. దీంతో డెలివరీ వివరాలు తెలుసుకోవడం, రిజర్వేషన్లు బుక్ చేయడం, ఆర్డర్లు ఇవ్వడం వంటి పనులను వాయిస్ కమాండ్లతో పూర్తి చేయవచ్చు. ఈ అనుసంధానాలతో కూడిన యాప్ స్టోర్ సమర్పణలను 2027 వసంతకాలం నుంచి స్వీకరించాలని యాపిల్ భావిస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!