

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ‘ప్రధానమంత్రి వికసిత్ గ్రామ స్వరాజ్ యోజన’కు ఆమోదం లభించింది. ఈ పథకం కోసం మొత్తం రూ.7,395.55 కోట్లను కేటాయించారు. 2026–27 నుంచి 2030–31 వరకు ఐదేళ్లపాటు ఈ పథకం అమలుకానుంది. గ్రామ పంచాయతీలు స్థానిక అవసరాలు, ప్రజల ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను రూపొందించుకునేలా ఈ పథకం తోడ్పడనుంది.
ఈ పథకంలో భాగంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ సిబ్బందికి పరిపాలన, సుపరిపాలన, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనపై ప్రత్యేక శిక్షణ అందించనున్నారు. పంచాయతీలు తమ సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంతో పాటు అందుబాటులో ఉన్న నిధులను పారదర్శకంగా, సమర్థంగా వినియోగించుకునేలా ప్రోత్సహిస్తారు. దేశవ్యాప్తంగా 2.55 లక్షలకు పైగా పంచాయతీలు, సంప్రదాయ స్థానిక సంస్థల్లోని సుమారు 32 లక్షల మంది ప్రజాప్రతినిధులు, ఇతర సంబంధిత వర్గాలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!