

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం, దార్శనికతపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానం ‘ఆంత్రప్రెన్యూర్స్ కాదు.. ఆంధ్రాప్రెన్యూర్స్’ అని పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించడం చంద్రబాబు ప్రత్యేకత అని, ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత దాన్ని సాధించే వరకు ఆయన నిరంతరం కృషి చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రానికి డబుల్ ఇంజిన్ సర్కార్ మరో అవకాశమని రామ్మోహన్ నాయుడు అన్నారు.
విశాఖపట్నాన్ని ప్రధాన ఆర్థికాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు అనేక సంస్కరణలు అమలవుతున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని చెప్పారు. చంద్రబాబు నాయకత్వాన్ని దగ్గరగా గమనిస్తున్నానని, ఆయన ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునే నిత్య విద్యార్థిగా ఉంటారని ప్రశంసించారు. సంస్కరణల అమలులో అలుపెరగకుండా పనిచేస్తారని, ఐటీ రంగం గురించి చాలామందికి అవగాహన లేని సమయంలోనే చంద్రబాబు దాని ప్రాధాన్యతను గుర్తించారని గుర్తుచేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతోందని పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!