

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన నిరాహార దీక్షను ఆలస్యం కాకముందే విరమించేలా ఎవరైనా ఒప్పించాలని ఆమె కోరారు. ఎక్స్ (X) వేదికగా చేసిన పోస్టులో, నీట్ వివాదంతో పాటు ప్రశ్నాపత్రాల లీకులు, పునఃపరీక్షల కారణంగా విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని, అందువల్ల ప్రస్తుతం చాలామంది వాంగ్చుక్ దీక్షపై దృష్టి పెట్టలేకపోతున్నారని పేర్కొన్నారు. అలాగే అధికారంలో ఉన్నవారు ఆయన నిరాహార దీక్షపై పెద్దగా స్పందించడం లేదని విమర్శించారు.
ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన చిన్మయి, వ్యవస్థలో అవినీతి ఉందని ఆరోపించారు. చివరగా, "దుర్మార్గుల చేతుల్లో ఉన్న అందమైన దేశం... దేవుడా నా దేశాన్ని కాపాడు" అనే భావోద్వేగ వ్యాఖ్యతో తన పోస్టును ముగించారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీయగా, కొందరు సోనం వాంగ్చుక్ ఆరోగ్యంపై ఆమె వ్యక్తం చేసిన ఆందోళనకు మద్దతు తెలపగా, మరికొందరు ప్రభుత్వంపై చేసిన విమర్శలను వ్యతిరేకించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!