

తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన అధ్యయనం చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ తొమ్మిది మంది సభ్యులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సంయుక్త కమిషనర్ సంజయ్‌కుమార్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభ వేడుకలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు పాల్గొని నీటి వినియోగం, రాష్ట్రాల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశం నేపథ్యంలో కమిటీ ఏర్పాటు జరిగింది.
కేంద్ర జలసంఘం సభ్యుడు ఛైర్మన్‌గా ఉన్న ఈ కమిటీలో సంబంధిత రాష్ట్రాల ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. ఆరు నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. న్యాయ, సాంకేతిక, ఆపరేషనల్ అంశాలతో పాటు ఆర్డీఎస్ కింద సాగునీటి అవసరాలు, జలాశయంలో పూడిక ప్రభావం, విద్యుదుత్పత్తి, వరద నియంత్రణ, డ్యాం భద్రతపై అధ్యయనం చేయనున్నారు. అదనంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సాధ్యాసాధ్యాలను పరిశీలించి, ట్రైబ్యునల్ అవార్డులు, ఒప్పందాలను పరిగణనలోకి తీసుకుంటారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!