

బెంగళూరులో మూడేళ్లుగా ఉద్యోగం చేస్తున్న చారు గుప్తా అనే మహిళ.. కార్పొరేట్ ఉద్యోగ జీవితంలోని ఒత్తిడిని పాఠశాల పరీక్షలతో పోలుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్కూల్లో పరీక్షకు ముందు రోజు సిలబస్, చదువు, ఫలితం గురించి ఎలా ఆందోళన చెందేవారో.. ఉద్యోగ జీవితంలోనూ ప్రతిరోజూ అదే తరహా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఒక రోజు పనిని ఎలాగైనా పూర్తి చేసి, మరుసటి రోజు పనికి సిద్ధం కావాల్సి వస్తోందని తెలిపారు.
వారాంతాల్లోనూ పని ఒత్తిడి వెంటాడుతోందని చారు గుప్తా వివరించారు. శని, ఆదివారాలు సెలవులు ఉన్నప్పటికీ ల్యాప్‌టాప్‌లో పెండింగ్‌లో ఉన్న పనుల గురించే ఆలోచన వస్తోందని చెప్పారు. చేయాల్సిన పని ఉందనే ఆందోళనతో ఉన్నప్పటికీ, దాన్ని ప్రారంభించడానికి ఉత్సాహం లేకపోవడం మరో సమస్యగా మారుతోందన్నారు. ఆదివారం రాత్రి వరకు ఒత్తిడి కొనసాగి, చివరి నిమిషంలో అత్యవసర పనులను పూర్తి చేసి మరుసటి రోజును ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచించాల్సి వస్తోందని తెలిపారు.
చారు గుప్తా పోస్టుకు నెటిజన్ల నుంచి పెద్దఎత్తున స్పందన వచ్చింది. చాలామంది తమ ఉద్యోగ జీవితంలోనూ ఇదే పరిస్థితి ఉందని కామెంట్ చేశారు. పరీక్షలు పూర్తయ్యాక విద్యార్థులకు కొంత విరామం లభిస్తుందని, కానీ ఉద్యోగ జీవితంలో ఒక పని, ఒక గడువు పూర్తయ్యేలోపే మరో పని ఎదురవుతుందని పలువురు పేర్కొన్నారు. పని పూర్తికాకపోతే ఏమవుతుందోనన్న భయం, చివరి నిమిషం వరకు వాయిదా వేయడం, ఆ తర్వాత హడావుడిగా పూర్తి చేయడం వంటి చక్రం చాలామంది ఉద్యోగులకు సాధారణమైందని నెటిజన్లు స్పందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!