

మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వాలు స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా స్వావలంబన దిశగా నడిపిస్తున్నాయి. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మహిళా సంఘాలను ఏర్పాటు చేసి, వివిధ కార్యక్రమాల ద్వారా వారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. అయితే మహిళా సంఘాలను పర్యవేక్షించే గ్రామైక్య సంఘాల (వీవో) నిర్వహణలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. పలు వీవో సంఘాల నిర్వహణలో ఏకచక్రాధిపత్యం కొనసాగుతోందని, జిల్లా సమాఖ్యలోనూ ఇదే పరిస్థితి ఉందని కొందరు మహిళా సంఘాల సభ్యులు ఆరోపిస్తున్నారు.
నిబంధనల ప్రకారం వీవో కమిటీలను నిర్దిష్ట కాల వ్యవధిలో పునర్వ్యవస్థీకరించాల్సి ఉన్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యంతో కొందరు ఏళ్ల తరబడి పదవుల్లో కొనసాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 12 మండలాలు ఉండగా, 364 వీవో సంఘాలు ఉన్నాయని సమాచారం. మండలాల కమిటీలు ఏర్పడిన తర్వాత ఆయా మండలాల అధ్యక్షులు జిల్లా అధ్యక్షురాలిని ఏకగ్రీవంగా లేదా ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే నూతన కమిటీల ఏర్పాటు ప్రక్రియ సక్రమంగా జరగడం లేదని పలువురు సభ్యులు ఆరోపిస్తున్నారు.
వీవో సంఘాల జనరల్ బాడీ సమావేశాలు నిర్వహించి ప్రజాస్వామ్యబద్ధంగా కొత్త పాలకవర్గాలను ఎన్నుకోవాల్సి ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో అదే వ్యక్తులు పదవులను మార్చుకుంటూ కొనసాగుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక టర్మ్‌లో అధ్యక్షురాలిగా ఉన్నవారు తర్వాత కార్యదర్శిగా, ఆపై మళ్లీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారని సభ్యులు చెబుతున్నారు. ఇలా కొందరు సుమారు పదేళ్లుగా వివిధ పదవుల్లో కొనసాగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నూతన కమిటీలను ఎన్నుకోవాలని సర్వసభ్య సమావేశాల్లో తీర్మానాలు చేసినప్పటికీ, వాటిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని సభ్యులు విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉండగా, వీవో సంఘాల్లో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించే సభ్యులను బెదిరిస్తున్నారని, కొందరిని కమిటీల నుంచి తొలగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల గణపురం మండలంలో వీవో సంఘం నాయకురాలి వ్యవహారాలను ప్రశ్నించిన ఓ కమిటీ సభ్యురాలిపై చెప్పుతో దాడి జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితులు డీఆర్‌డీఏ పీడీకి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. కిందిస్థాయి సీసీల నుంచి ఉన్నతాధికారుల వరకు కొందరి సహకారంతోనే అక్రమాలు కొనసాగుతున్నాయని సభ్యులు ఆరోపిస్తున్నారు. రెండేళ్లకు పైగా పదవుల్లో కొనసాగుతున్న వీవో కమిటీలను రద్దు చేసి, వెంటనే మహాసభలు నిర్వహించి కొత్త పాలకవర్గాలను ఎన్నుకోవాలని వారు కోరుతున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!