

రాష్ట్రంలో గణేశ్ చతుర్థి, నిమజ్జనాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఐ స్థాయి నుంచి పైస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉత్సవాల భద్రతపై సమీక్షించారు. ఈ నెల 14న గణేశ్ చతుర్థి, 25న నిమజ్జన కార్యక్రమాలు జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
గణేశ్ మండపాలు, నిర్వాహకులు, నిమజ్జనానికి ఉపయోగించే వాహనాల వివరాలతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీజీపీ తెలిపారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు వాలంటీర్లను నియమించుకునేలా నిర్వాహకులను ప్రోత్సహించాలని ఆదేశించారు. మండపాలను జియోట్యాగింగ్ చేసి ‘టీజీ-కాప్’ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఉత్సవ కమిటీలతో ఎస్పీలు, కమిషనర్లు, డీసీపీలు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!