

ఔటర్ రింగ్ రోడ్డు పరిధి-క్యూర్‌లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ తరహాలోనే రాష్ట్రంలోని ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలోనూ ఇళ్లను నిర్మించి పేదలకు అందిస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శాసనమండలిలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు తీన్మార్ మల్లన్న, బస్వరాజు సారయ్య, సత్యం, ఏవీఎన్ రెడ్డి, అంజిరెడ్డి, శంకర్ నాయక్, భానుప్రసాద్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో తొలి విడతగా 4.50 లక్షల ఇళ్లకు అనుమతులు మంజూరు చేయగా, 3.28 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. వీటిలో 1.97 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తై గృహప్రవేశాలు జరిగాయని చెప్పారు. దసరా నాటికి మొత్తం 2 లక్షల మంది లబ్ధిదారులు సొంత ఇళ్లలోకి ప్రవేశించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. రెండో విడతలో మరో 2 లక్షల ఇళ్లకు మంజూరు ఇచ్చామని, ఈ నెల 20లోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. క్యూర్ పరిధిలో మరో లక్ష ఇళ్లను నిర్మిస్తున్నామని, త్వరలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని మంత్రి పేర్కొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!