

అంతర్జాతీయ రక్షణ రంగంలో టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్ మరో కీలక మైలురాయిని సాధించింది. హైదరాబాద్‌లోని అత్యాధునిక తయారీ కేంద్రం నుంచి ఏహెచ్-64ఈ అపాచీ దాడి హెలికాప్టర్ కోసం 400వ ఫ్యూజ్‌లేజ్‌ను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్లు సంస్థ ప్రకటించింది. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్, బోయింగ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థకు హైదరాబాద్‌లో 52,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక తయారీ కేంద్రం ఉంది. ఇక్కడ 750 మందికి పైగా ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు అధునాతన రోబోటిక్స్, స్వయంచాలక సాంకేతికతల సాయంతో అపాచీ ఫ్యూజ్‌లేజ్ నిర్మాణాలను తయారు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో తయారైన ఫ్యూజ్‌లేజ్‌లను అంతర్జాతీయంగా సరఫరా చేస్తున్నారు. అమెరికా సైన్యం వినియోగించే అపాచీ హెలికాప్టర్లతో పాటు, 2025లో భారత సైన్యానికి అందిన ఆరు అపాచీ హెలికాప్టర్లలోనూ హైదరాబాద్‌లో తయారైన ఫ్యూజ్‌లేజ్‌లను అమర్చారు. భారత వైమానిక దళం ఇప్పటికే 22 ఏహెచ్-64ఈ అపాచీ హెలికాప్టర్లను నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 19 దేశాలు దాదాపు 1,300 అపాచీ హెలికాప్టర్లను వినియోగిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ తయారీ కేంద్రానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యం పెరుగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!