

తమిళనాడులో జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కావేరి జలాలు, డీలిమిటేషన్, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక పంపకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నీటి పంపకాలపై వివాదాలకు బదులుగా పరస్పర సహకారం వైపు రాష్ట్రాలు ముందుకు సాగాలని సూచించారు. నీటి విషయంలో సమానత్వం, పారదర్శకత, సహకారం కీలకమని పేర్కొన్నారు. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ కారణంగా రాజకీయంగా నష్టం జరగకూడదని అన్నారు. 1971 జనాభా ప్రాతిపదికను కొనసాగించాలని, లోక్‌సభలో ప్రస్తుత 543 సీట్ల సంఖ్యను కొనసాగిస్తూ అందులోనే మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు.
కేంద్ర పన్నుల పంపకాల్లో కర్ణాటక వాటా తగ్గడంపై కూడా డీకే శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. 14వ ఆర్థిక సంఘం కాలంలో కర్ణాటక వాటా 4.713 శాతం ఉండగా.. 15వ ఆర్థిక సంఘం కాలంలో అది సుమారు 3.646 శాతానికి తగ్గింది. 16వ ఆర్థిక సంఘం సిఫారసుల్లో ఈ వాటా సుమారు 4.13 శాతానికి పెరిగింది. గతంలో ఉన్న 4.7 శాతం వాటాను తిరిగి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బెంగళూరు–ముంబయి హైస్పీడ్ రైలు, STRR సౌత్ ప్రాజెక్టులు, రాయచూర్‌కు ఎయిమ్స్, కల్యాణ కర్ణాటకకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. ఖనిజ వనరులపై రాష్ట్రాల పన్ను హక్కులను పరిరక్షించాలని, మైన్స్ అండ్ మినరల్స్ బిల్లును పునఃపరిశీలించాలని, డ్రగ్స్ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం–రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య విధానం మరింత బలోపేతం కావాలని డీకే శివకుమార్ కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!