

ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు 2026లో ఇప్పటివరకు ప్రభుత్వ ఖజానాపై రూ.74.58 కోట్ల వ్యయం అయినట్లు కేంద్ర విదేశాంగ శాఖ రాజ్యసభకు వెల్లడించింది. 2021 నుంచి 2026 వరకు మోదీ విదేశీ పర్యటనలపై మొత్తం వ్యయం రూ.550 కోట్లను దాటినట్లు తెలిపింది. 2026కు సంబంధించిన కొన్ని గణాంకాలు తాత్కాలికమైనవని, జూన్‌లో మోదీ ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన ఖర్చుల లెక్కలు ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా పేర్కొన్నారు. 2021లో రూ.36 కోట్లకు పైగా, 2022లో రూ.55 కోట్లు, 2023లో రూ.93 కోట్లు, 2024లో రూ.109 కోట్లు, 2025లో రూ.180 కోట్లు, 2026లో ఇప్పటివరకు రూ.74.58 కోట్లుగా వ్యయం నమోదైంది.
2021 జూలై నుంచి ప్రధాని విదేశీ పర్యటనల సందర్భంగా 316 అవగాహన ఒప్పందాలు, ఇతర ఒప్పందాలు కుదిరినట్లు కేంద్రం వెల్లడించింది. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, అంతరిక్ష సహకారం, వలసలు, వాతావరణ మార్పు, సాంస్కృతిక మార్పిడి వంటి రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. 2026లో తుది ఖర్చులు ఖరారైన పర్యటనల్లో మోదీ ఐదు దేశాల యూరప్ పర్యటనలో నార్వే పర్యటనకు అత్యధికంగా రూ.17.46 కోట్లు ఖర్చయినట్లు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!