

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించే రేషన్ బియ్యం పంపిణీ గడువును పౌరసరఫరాల శాఖ సెప్టెంబర్ 5వ తేదీ వరకు పొడిగించింది. ఎల్‌నినో పరిస్థితుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల కోటాను ఒకే విడతలో ఆగస్టు 31లోపు పంపిణీ చేయాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. అయితే ఒకేసారి మూడు నెలల సరుకులు తీసుకునేందుకు రేషన్ దుకాణాల వద్ద భారీగా రద్దీ ఏర్పడటంతో పాటు, రాఖీ పౌర్ణమి సెలవుల కారణంగా పలువురు లబ్ధిదారులు సొంతూళ్లకు వెళ్లడంతో నిర్ణీత గడువులోగా బియ్యం తీసుకోలేకపోయారు.
లబ్ధిదారులు ఎవరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో పౌరసరఫరాల శాఖ అధికారులు పంపిణీ గడువును మరో ఐదు రోజుల పాటు పొడిగించారు. సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం వరకు రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. మూడు నెలల కోటాను ఇంకా తీసుకోని అర్హులైన కార్డుదారులు గడువు ముగిసేలోపు సమీప రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యం తీసుకోవాలని అధికారులు సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!