

థాయ్‌లాండ్‌లోని పుకెట్ నుంచి దిల్లీకి బయల్దేరిన ఎయిరిండియా విమానం ఆగస్టు 4న తీవ్ర కుదుపులకు గురైంది. 145 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా దాదాపు ఒకేసారి మూడు హైడ్రాలిక్ వ్యవస్థలు పనిచేయడం నిలిచిపోయాయి. దీంతో స్వయంచాలక విమాన నియంత్రణ వ్యవస్థ నిలిచిపోవడంతో విమానం అకస్మాత్తుగా కొన్ని వేల అడుగుల మేర కిందికి దిగింది. ఈ ఘటనలో 24 మంది ప్రయాణికులు గాయపడ్డారు. కొద్దిసేపటికే హైడ్రాలిక్ వ్యవస్థలు తిరిగి పనిచేయడంతో విమానం సురక్షితంగా దిల్లీలో దిగింది. ఘటన సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏవీ లేవని విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించింది.
విమానం దిల్లీలో దిగిన తర్వాత విమాన పైలట్‌కు నిర్వహించిన పరీక్షల్లో నిషేధిత మానసిక ప్రభావిత పదార్థాన్ని వినియోగించినట్లు గుర్తించారు. ప్రయోగశాల పరీక్షల్లోనూ ఈ విషయం నిర్ధారణ అయింది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశమని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. ఇటువంటి పదార్థాల వినియోగాన్ని నిరోధించేందుకు పౌర విమానయాన నియంత్రణ సంస్థ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే హైడ్రాలిక్ వ్యవస్థల వైఫల్యానికి, పైలట్ ప్రవర్తనకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే అంశంపై ప్రాథమిక నివేదికలో స్పష్టత ఇవ్వలేదు. విమానంలోని సాంకేతిక సమస్యలపై దర్యాప్తు కొనసాగుతోందని, తుది నివేదికలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!