

తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ‘మన ప్యానల్’ హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. ‘మన ప్యానల్’ తరఫున తనను ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న నిర్మాత బండ్ల గణేశ్‌తో తాను మాట్లాడినట్లు వెల్లడించారు. గిల్డ్ సభ్యులు కౌన్సిల్‌కు పూర్తిగా సహకరించకుండా వెన్నుపోటు వైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే కొందరు కౌన్సిల్‌కు రావాల్సిన కమిషన్ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, కొత్త నిర్మాతలకు సభ్యత్వం ఇవ్వడంలోనూ సమస్యలు ఉన్నాయని విమర్శించారు.
ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే నిర్మాతల మెడిక్లెయిమ్ పరిమితిని రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతామని ‘మన ప్యానల్’ హామీ ఇచ్చింది. ఒక్క సినిమా తీసిన నిర్మాతలకు కూడా మెడిక్లెయిమ్ వర్తింపజేసి వెంటనే కార్డులు అందజేస్తామని తెలిపింది. పేద నిర్మాతల పిల్లల చదువుకు రూ.30 వేలు, ఆడబిడ్డల వివాహానికి రూ.30 వేలు లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది. వృద్ధ నిర్మాతల కోసం పెన్షన్ కమిటీ ఏర్పాటు చేసి సహకారం అందించడంతో పాటు మరణించిన నిర్మాతల కుటుంబాలను ఆదుకుంటామని పేర్కొంది. చిన్న సినిమాలకు వెబ్‌సైట్ ద్వారా ఓటీటీ బిజినెస్ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు నిర్మాతల కష్టాన్ని కొనియాడగా, నిర్మాత టి.ప్రసన్న కుమార్ నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారమే జరిగిందని తెలిపారు. పరిశ్రమ అభివృద్ధి కోసం పోటీలో ఉన్న సభ్యులంతా ఏకతాటిపై పనిచేస్తామని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!