

షావోమీ అనుబంధ సంస్థ పోకో దేశీయ మార్కెట్లోకి ఎక్స్8, ఎక్స్8 పవర్ పేర్లతో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఇప్పటికే ఎక్స్8 ప్రో, ఎక్స్8 ప్రో మ్యాక్స్ మోడళ్లను తీసుకొచ్చిన సంస్థ.. తాజాగా ఈ రెండు ఫోన్లను మిడ్‌రేంజ్ విభాగంలో ప్రవేశపెట్టింది. ఎక్స్8లో 9,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఎక్స్8 పవర్‌లో ఏకంగా 10,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3తో పనిచేస్తాయి. నాలుగేళ్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, ఆరేళ్ల భద్రతా అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ తెలిపింది.
రెండు మోడళ్లలో 6.83 అంగుళాల 1.5కే సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, 3,500 నిట్స్ గరిష్ఠ ప్రకాశం ఉన్నాయి. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో పాటు ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కే రేటింగ్స్ లభించాయి. 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. ఎక్స్8 పవర్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఎక్స్8లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఎక్స్8 పవర్ 100 వాట్ల వేగవంతమైన ఛార్జింగ్, 27 వాట్ల రివర్స్ ఛార్జింగ్‌కు, ఎక్స్8 67 వాట్ల ఛార్జింగ్, 22.5 వాట్ల రివర్స్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. పోకో ఎక్స్8 ధర రూ.29,999 నుంచి, ఎక్స్8 పవర్ ధర రూ.35,999 నుంచి ప్రారంభమవుతుంది. రూ.2,000 కూపన్ డిస్కౌంట్, రూ.1,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తున్నారు. సెప్టెంబర్ 11 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!