

నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్)లో పులులు, చిరుతలకు తగినంత ఆహారం లభించడం లేదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎక్కువ కాలం సరైన వేట జంతువులు దొరకకపోవడంతోనే అవి సమీప గ్రామాల్లోకి వచ్చి సాధారణ జంతువులను వేటాడుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. అటవీ, వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ వాటి వినియోగంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గుండ్లకమ్మ అటవీ క్షేత్రంలోని దిగువమెట్ట వన సంరక్షణ సమితికి కాంపా కింద కేటాయించిన సుమారు రూ.50 లక్షలను నిబంధనలకు విరుద్ధంగా నంద్యాలలోని ఎఫ్‌డీపీటీ సర్కిల్ కార్యాలయ నిర్మాణానికి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి.
పులులకు ఆహార కొరత లేకుండా వేట జంతువుల సంఖ్యను పెంచేందుకు పచ్చర్ల, తెట్టగుండం, పెద్దపెంట, ఆరెపెంట, మాలకొండపెంట ప్రాంతాల్లో గతంలో హెర్బ్ ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన దుప్పులు, జింకలు తదితర జంతువులను కొంతకాలం అక్కడ ఉంచి, స్థానిక వాతావరణానికి అలవాటు పడిన తర్వాత అడవిలోకి వదిలేవారు. అయితే కొంతకాలం తర్వాత ఈ కార్యక్రమం సక్రమంగా కొనసాగలేదనే విమర్శలు ఉన్నాయి. అలాగే గాయపడిన పులులు, తల్లి నుంచి విడిపోయిన పులి పిల్లల సంరక్షణ కోసం పెద్దపెంటలో సుమారు రూ.2 కోట్లతో చేపట్టిన ఎన్‌క్లోజర్ నిర్మాణం కూడా మధ్యలో నిలిచిపోయి, తిరిగి ప్రారంభించినప్పటికీ ఇంకా పూర్తికాలేదని సమాచారం. మరోవైపు యాంటీ పోచింగ్ విభాగం, స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ వంటి విభాగాలు అటవీ ప్రాంతాల్లో ఉచ్చులు, విద్యుత్ కంచెలు, వేటగాళ్ల కదలికలను నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయిలో ఆ చర్యలు ఆశించిన స్థాయిలో లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాచర్ల బీట్‌లో నెల రోజుల క్రితం తుపాకీతో పెద్ద పులిని కాల్చి చంపిన ఘటనను సంబంధిత నిఘా విభాగాలు గుర్తించలేకపోయాయనే ఆరోపణలు కూడా అటవీ సంరక్షణ వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!