

తిరుమల బ్రహ్మోత్సవాలు నేడు తొమ్మిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగే మహోత్సవంగా ప్రసిద్ధి చెందాయి. ధ్వజారోహణం నుంచి చక్రస్నానం వరకు, ఉదయం-సాయంత్రం వాహన సేవలు, లక్షలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో సప్తగిరులు మార్మోగుతాయి. అయితే ఈ వైభవం ఒక్కరోజులో రూపుదిద్దుకున్నది కాదు. శతాబ్దాలుగా రాజులు, రాణులు, సామంతులు, అధికారులు, భక్తులు అందించిన దానధర్మాలు, ఆలయ పరిపాలనా మార్పులు, ఆగమ సంప్రదాయాలు, కాలానుగుణంగా ఏర్పడిన ఉత్సవాలు కలిసి నేటి బ్రహ్మోత్సవాల రూపాన్ని తీర్చిదిద్దాయి. పురాణ కథనాలకే పరిమితం కాకుండా తిరుమల ఆలయ గోడలపై చెక్కిన శాసనాలు ఈ ఉత్సవాల చారిత్రక పరిణామానికి కీలక ఆధారాలుగా నిలుస్తున్నాయి. పల్లవ రాణి సామవై పెరుందేవి సమర్పించిన వెండి భోగ శ్రీనివాసమూర్తి, ఆభరణాలు, ఉత్సవాల నిర్వహణకు చేసిన భూదానాలకు సంబంధించిన శాసనం 10వ శతాబ్దంలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు సూచిస్తోంది.
చోళులు, యాదవరాయులు, విజయనగర రాజుల కాలంలో బ్రహ్మోత్సవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. శ్రీకృష్ణదేవరాయలు 1513లో తన జన్మమాసంలో కొత్త బ్రహ్మోత్సవాన్ని ఏర్పాటు చేసినట్లు శాసనాలు పేర్కొంటున్నాయి. అచ్యుతరాయుల కాలంలో 1533లో కార్తీ బ్రహ్మోత్సవం ప్రస్తావన కనిపించగా, 1539లో తాళ్లపాక పెద తిరుమలయ్యంగార్ ఆధ్వర్యంలో ఆణి బ్రహ్మోత్సవం ఏర్పడింది. శాసనాల ప్రకారం మలయప్పస్వామిని ఉత్సవమూర్తిగా వినియోగించే సంప్రదాయం కూడా పాతకాలం నుంచే ఉంది. విజయనగర సామ్రాజ్య కాలం చివరి దశకు వచ్చేసరికి సంవత్సరానికి పది బ్రహ్మోత్సవాల వరకు నిర్వహించినట్లు ఆధారాలు ఉన్నాయి. అంతకుముందు చోళులు, యాదవరాయుల కాలంలో కొత్త ఉత్సవాలు చేరడంతో విజయనగర సామ్రాజ్యం ఏర్పడే నాటికి ఏడాదికి ఐదు బ్రహ్మోత్సవాలు నిర్వహించే స్థాయికి సంప్రదాయం చేరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!