

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేస్తే అనారోగ్యం మరింత ముదురుతుందని, జలుబు చేస్తుందని చాలామంది భావిస్తుంటారు. అయితే వైద్య నిపుణుల ప్రకారం, సరైన పద్ధతిలో స్నానం చేస్తే జ్వరం సమయంలో కూడా అది సాధారణంగా సురక్షితమే. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి ఉపశమనం లభించడంతో పాటు చెమట, చర్మంపై పేరుకున్న మలినాలు తొలగిపోతాయి. జ్వరం కారణంగా వచ్చే నీరసం, ఒళ్లునొప్పులు, అసౌకర్యం కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది.
అయితే స్నానం చేసే సమయంలో నీటి ఉష్ణోగ్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చాలా చల్లటి నీటితో స్నానం చేస్తే రక్తనాళాలు కుంచించుకుపోయి వణుకు రావచ్చు. దీంతో శరీరం మరింత అసౌకర్యానికి గురవుతుంది. అదే సమయంలో మరీ వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీర వేడి పెరిగే అవకాశం ఉంది. అందుకే శరీరానికి అనుకూలంగా ఉండే గోరువెచ్చని నీటినే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. తీవ్రమైన నీరసం లేదా తలతిరుగుడు కారణంగా స్నానం చేయలేని పరిస్థితిలో ఉన్నవారిని బలవంతం చేయకూడదు. అలాంటి సమయంలో గోరువెచ్చని నీటిలో ముంచిన శుభ్రమైన కాటన్ టవల్‌తో మెడ, చంకలు, చేతులు, కాళ్లను మెల్లగా తుడవవచ్చు.
స్నానానికి ముందు, తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బాత్‌రూమ్‌కు వెళ్లే ముందు ఫ్యాన్ లేదా ఏసీని ఆపి చల్లటి గాలి నేరుగా తగలకుండా చూసుకోవాలి. స్నానం పూర్తయిన వెంటనే శరీరాన్ని, తలను పొడి టవల్‌తో పూర్తిగా తుడుచుకుని, తేలికపాటి గాలి ఆడే కాటన్ దుస్తులు ధరించాలి. శరీరంలో వేడి ఎక్కువగా నిలిచిపోకుండా అనవసరంగా బరువైన దుప్పట్లు కప్పుకోవడం మానుకోవాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!