

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. తొలిసారిగా లీడర్‌షిప్ కాన్‌క్లేవ్ నిర్వహిస్తున్నామని, నాయకత్వం అంటేనే తెలుగుదేశం అని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, అయితే నీటి సమస్యలకు పరిష్కారం చూపినప్పుడే తనకు అత్యంత సంతృప్తి కలుగుతుందని చెప్పారు. సమర్థ నాయకత్వంతోనే సమస్యలను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయగలమన్నారు. వర్తమానాన్ని అర్థం చేసుకుని భవిష్యత్తును అంచనా వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని వెంటిలేటర్‌పై పెట్టి వ్యవస్థలను విధ్వంసం చేసిందని విమర్శించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి కూటమిని ఏర్పాటు చేశామని, ప్రజలు ఎన్నడూ లేని విజయాన్ని కూటమికి అందించారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనను సమతుల్యం చేస్తూ పాలన సాగిస్తున్నామని, స్వర్ణాంధ్ర విజన్-2047తో పాటు జిల్లాలు, నియోజకవర్గాలకు ప్రత్యేక విజన్ ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.
విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చంద్రబాబు తెలిపారు. 63 లక్షల మందికి రూ.73 వేల కోట్ల మేర పింఛన్లు పంపిణీ చేశామని, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అన్న క్యాంటీన్లు, ఆటో డ్రైవర్లు, నేతన్నలు, మత్స్యకారుల సంక్షేమం వంటి పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, పోలవరం, అమరావతి ప్రాజెక్టులను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 28 కొత్త పాలసీల ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తూ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపునిచ్చామని అన్నారు. గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ వంటి పెట్టుబడులు ఉత్తరాంధ్రకు వస్తున్నాయని తెలిపారు. అమరావతిని క్వాంటం నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. పరిపాలనలో సాంకేతికతను వినియోగిస్తూ వాట్సాప్ ద్వారా 1,100 సేవలను అందుబాటులోకి తెచ్చామని, భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీతో భూములకు భద్రత కల్పిస్తున్నామని, 22ఏ భూముల సమస్యలతో పాటు దీర్ఘకాలంగా పరిష్కారం కాని వివాదాలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!