

మహిళలను కించపరిచేలా లేదా అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హెచ్చరించారు. శాసనసభలో మాట్లాడుతూ.. భావప్రకటనా స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని, తాము మాట్లాడే మాటలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం ఈ అంశంపై పరోక్షంగా స్పందించారు. ద్వంద్వార్థాలు వచ్చే పదాలను ఉపయోగిస్తూ మాట్లాడేవారిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రతి ఇంట్లో తల్లి, అక్కా చెల్లెళ్లు ఉంటారని, మహిళలను అవమానించేలా మాట్లాడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని, ఇదే శాసనసభలో జయలలిత ఎదుర్కొన్న అవమానాలను కూడా అందరూ చూశారని విజయ్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై వచ్చిన విమర్శలపైనా విజయ్ స్పందించారు. పోలీస్ వ్యవస్థ కేవలం అరెస్టులు చేయడానికి మాత్రమే కాదని, రాష్ట్ర అభివృద్ధికి అది కీలకమైన పునాది అని అన్నారు. చట్టాన్ని పాటించే వారికి పోలీసులు మిత్రులుగా, ఉల్లంఘించే వారికి కఠినంగా వ్యవహరించే వ్యవస్థగా ఉండాలని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు, అధికారులు పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. విమర్శలపై దృష్టి పెట్టకుండా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అవినీతిని ఏమాత్రం సహించబోమని పునరుద్ఘాటిస్తూ.. అధికారులు అవినీతికి పాల్పడితే వారి కుటుంబాలు సైతం సమాజంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లాకప్‌లో జరిగే నేరాలను సాధారణ ఘటనలుగా చూడబోమని, ఇలాంటి ఘటనలపై మేజిస్ట్రేట్ ద్వారా పారదర్శక విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!