

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ తయారు చేసే కాంపౌండెడ్ ఇంగువ (హింగ్) విక్రయాలపై నిషేధం విధించింది. ల్యాబొరేటరీ పరీక్షల్లో ఎవరెస్ట్ ఇంగువ నమూనాలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని, తప్పుదోవ పట్టించే లేబులింగ్ ఉన్నట్లు గుర్తించిన అనంతరం ఈ చర్య తీసుకుంది. నిబంధనల ప్రకారం కాంపౌండెడ్ ఇంగువలో కనీసం 5 శాతం ఆల్కహాల్ సాల్యూబుల్ ఎక్స్‌ట్రాక్ట్ ఉండాలి. అయితే పరీక్షించిన నమూనాల్లో ఇది 0–3 శాతం మాత్రమే ఉన్నట్లు FSSAI వెల్లడించింది. ఉత్పత్తి నాణ్యతను సరిచేసేందుకు యాక్షన్ ప్లాన్ సమర్పించాలని కంపెనీని ఆదేశించడంతో పాటు, మార్కెట్‌లో ఉన్న ప్రమాణాలు లేని బ్యాచ్‌లను స్వచ్ఛందంగా వెనక్కి తీసుకోవాలని సూచించింది.
ఇదే సమయంలో ఎవరెస్ట్ గరం మసాలా, చికెన్ మసాలా, ఎగ్ కర్రీ పౌడర్ ఉత్పత్తుల్లోనూ నిబంధనలకు సంబంధించిన లోపాలను FSSAI గుర్తించింది. ముఖ్యంగా లేబులింగ్‌లో ఉప్పు, మసాలా పదార్థాల వివరాల ప్రకటనకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ మూడు ఉత్పత్తులపై విక్రయ నిషేధం విధించలేదు. వినియోగదారుడి ఫిర్యాదు అనంతరం FSSAI చేపట్టిన మార్కెట్ నిఘా, ల్యాబొరేటరీ పరీక్షల్లో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆహార నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా కంపెనీ అవసరమైన చర్యలు తీసుకోవాలని FSSAI సూచించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!