

ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లోనే సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏఐ అసిస్టెంట్, డిజి వెరిఫై, డేటా లేక్, బ్లాక్‌చైన్ వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా వినియోగించాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కార్యాలయం నుంచి వివిధ శాఖల పనితీరు, పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. వాట్సప్ గవర్నెన్స్ ‘మనమిత్ర’ ద్వారా అందిస్తున్న 1,204 సేవల్లో డేటా ఎంట్రీని మరింత సరళీకరించాలని, సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా డేటా ఇంటిగ్రేషన్ చేపట్టాలని సూచించారు.
వ్యవసాయం, తాగునీరు, ప్రజారోగ్యంపై కూడా చంద్రబాబు అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు సమృద్ధిగా నీరు అందించాలని, ఇంకా సాగు ప్రారంభించని ప్రాంతాల్లో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. రైతులకు ఎప్పటికప్పుడు క్రాప్ అలర్ట్ సందేశాలు పంపడంతో పాటు వాటిపై తీసుకునే చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. కృష్ణా డెల్టాకు సెప్టెంబరు చివరి వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించగలమని అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి 1,361 డెంగీ కేసులు నమోదవగా, ఈ ఏడాది 401 కేసులు మాత్రమే నమోదైనట్లు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!