

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ‘బౌద్ధ అధ్యయన కేంద్రం’ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ఎస్. అబ్దుల్ నజీర్ సూచించారు. ఈ నెల 11న గుంటూరు జిల్లా నాగార్జున నగర్లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరిగిన స్వర్ణోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1967లో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన పీజీ కేంద్రంగా ప్రారంభమైన సంస్థ 1976లో పూర్తి స్థాయి విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందిందని గవర్నర్ తెలిపారు. 1976లో 10 విభాగాలు, 600 మంది విద్యార్థులతో ప్రారంభమైన విశ్వవిద్యాలయం ప్రస్తుతం 6,000 మంది విద్యార్థులు, 100 మంది పరిశోధక విద్యార్థులతో కొనసాగుతోందన్నారు. క్రీ.శ. 2వ శతాబ్దానికి చెందిన గొప్ప బౌద్ధ తత్వవేత్త, పండితుడు ఆచార్య నాగార్జున గౌరవార్థం 2004లో విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టారని గుర్తుచేశారు.
విశ్వవిద్యాలయానికి 2024లో న్యాక్ ‘ఏ+’ గ్రేడ్ లభించడం, క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్–2026, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్–2025లో గుర్తింపు పొందడంపై గవర్నర్ ఉపకులపతి ప్రొఫెసర్ కె. గంగాధర రావు, ఆయన బృందాన్ని అభినందించారు. ఆవిష్కరణలు, పరిశోధన, పారిశ్రామికత, సాంకేతిక ఆధారిత విద్య, సామాజిక పరివర్తన దిశగా విశ్వవిద్యాలయం ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ‘స్వర్ణాంధ్ర’, ‘వికసిత్ భారత్@2047’ లక్ష్యాల సాధనలోనూ తనవంతు పాత్ర పోషించాలని సూచించారు. అంతకుముందు స్వర్ణోత్సవ సంవత్సర ప్రత్యేక లోగోను గవర్నర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి ఇన్చార్జి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్. విజయ భాస్కర రావు, వైస్ చైర్పర్సన్ ప్రొఫెసర్ కె. రత్న షీలామణి పాల్గొన్నారు. ఉపకులపతి ప్రొఫెసర్ కె. గంగాధర రావు గవర్నర్ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!