

భారీ వర్షాలతో కేరళలో పరిస్థితులు తీవ్రంగా మారాయి. శనివారం పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి నాలుగేళ్ల బాలుడు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇడుక్కి జిల్లాలో ఇద్దరు, కొట్టాయం జిల్లాలో తల్లీకొడుకులు మృతిచెందారు. పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నదులు ఉప్పొంగడంతో ఆరు జిల్లాల్లో డ్యామ్‌ల గేట్లు ఎత్తివేశారు. 183వ జాతీయ రహదారిపైకి వరద నీరు చేరింది. పంపా నది పరివాహక ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోవడంతో పడవల ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున మేఘవిస్ఫోటం సంభవించింది. ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. కిశ్త్‌వాడ్, డోడా, రాంబన్ జిల్లాల్లో నదులు ఉప్పొంగడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. పరిస్థితుల దృష్ట్యా ఈ మూడు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!