

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తాడకమళ్ల వినోద్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం హైకోర్టులో ఘనంగా ఫుల్ కోర్టు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన న్యాయ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, విధుల నిర్వహణలో సహకరించిన తోటి న్యాయమూర్తులు, వివిధ కమిటీల సభ్యులు, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. పదవీ విరమణ అనేది భావోద్వేగంతో కూడుకున్నప్పటికీ ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిన వాస్తవమని పేర్కొన్నారు. జీవితాన్ని ఒక పరుగుపందెంతో పోల్చిన ఆయన.. ప్రతి రేసుకూ ముగింపు రేఖ ఉంటుందని, అది దాటిన తర్వాత కూడా పరుగెత్తడం వివేకం కాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రముఖ హిందీ కవి సాహిర్ లుధియాన్వీ కవితలను ప్రస్తావిస్తూ తన వీడ్కోలు ప్రసంగాన్ని భావోద్వేగభరితంగా ముగించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పుత్తిచెర సామ్ కోషి మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు జస్టిస్ వినోద్ కుమార్ అందించిన సేవలను కొనియాడారు. ఆయన న్యాయ సూత్రాల పట్ల చూపిన నిబద్ధత తీర్పులు, ఉత్తర్వుల్లో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. తన పదవీకాలంలో ఆయన మొత్తం 13,213 ప్రధాన కేసులు, 14,033 ఇతర కేసులను విచారించినట్లు వెల్లడించారు. ఆయన తీర్పులు న్యాయ పరిజ్ఞానం, న్యాయ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తాయని అన్నారు. అడ్వొకేట్ జనరల్ ఏ. సుదర్శన్ రెడ్డి కూడా జస్టిస్ వినోద్ కుమార్ సేవలను ప్రశంసించారు. ఈ వీడ్కోలు కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ, అదనపు అడ్వొకేట్ జనరళ్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, తెలంగాణ హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయాధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది హాజరయ్యారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!