

హైదరాబాద్‌లో నకిలీ లేదా గుర్తింపు లేని వైద్య అర్హతలతో క్లినిక్‌లు నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్నారనే ఆరోపణలపై నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. కాలనీల్లో ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా క్లినిక్‌లు ఏర్పాటు చేసి, వైద్య అర్హతలు ఉన్నట్లు ప్రచారం చేసుకుంటూ చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తక్కువ ఫీజులకు వైద్యం అందిస్తారనే కారణంతో ఇలాంటి వ్యక్తులను ఆశ్రయించడం ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు. అర్హత లేని వ్యక్తుల వద్ద చికిత్స తీసుకోవడం వల్ల రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. రహ్మత్‌నగర్ క్రాస్‌రోడ్‌లోని శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌లో డి. రామశేఖర్‌రెడ్డి వైద్యుడిగా చెలామణి అవుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయన డి.ఫార్మసీ చదివినప్పటికీ వైద్యుడిగా చికిత్స అందించినట్లు పోలీసులు తెలిపారు. ఎనస్తీషియా టెక్నీషియన్‌గా పనిచేసిన ఆర్. సుధాకర్‌తో కలిసి క్లినిక్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. గడువు ముగిసిన మందులు, ఇంజక్షన్లు వినియోగించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఎం. భారతి పారామెడికల్ కోర్సు పూర్తి చేసి నర్సుగా పనిచేసిన అనుభవంతో రహ్మత్‌నగర్‌లో చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు గుర్తించారు. సెలైన్‌లు, ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు గాయాలకు కుట్లు వేస్తూ అదనపు ఫీజులు వసూలు చేసినట్లు పోలీసులు ఆరోపించారు. మరో నిందితుడు కె. మహేశ్‌రావు బీఏ చదివి, వైద్యుడిగా చెప్పుకుంటూ జూబ్లీహిల్స్ పరిధిలో రోగులకు ఇంజక్షన్లు, సెలైన్లు అందించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి మందులు, ఇంజక్షన్లు, వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
తక్కువ ఫీజు అనే కారణంతో అర్హత లేని వ్యక్తుల వద్ద వైద్యం చేయించుకోవద్దని హైదరాబాద్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ప్రజలకు సూచించారు. కాలనీల్లో అర్హతలు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న వ్యక్తుల గురించి సమాచారం అందితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్యుడిని సంప్రదించే ముందు ఆయన విద్యార్హతలు, వైద్య రిజిస్ట్రేషన్ వివరాలను నిర్ధారించుకోవాలని అధికారులు సూచించారు. నిందితులపై నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా వారి అర్హతలు, వినియోగించిన మందులు, వైద్య పరికరాలపై మరిన్ని వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!