

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై పూర్తి సమాచారం లేకుండా బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ విమర్శించారు. తెలంగాణలో విద్య, అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంటే.. రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. గతంలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించిన ఆయన.. ఇప్పుడు అదే పార్టీ నేతలు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు.
కిషన్ రెడ్డి తన విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వలేదని చెబుతున్నారని పేర్కొన్న చామల కిరణ్.. ఆయన గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి యూకే పర్యటనకు అనుమతి ఇచ్చి, అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం గతంలో ఎప్పుడూ జరగలేదని అన్నారు. తెలంగాణకు రావాల్సిన సెమీకండక్టర్ పెట్టుబడులను గుజరాత్‌కు ఎందుకు తరలించారని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవనం, ఆర్‌ఆర్‌ఆర్, మెట్రో వంటి అభివృద్ధి ప్రాజెక్టులను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. దేశంలో విద్య, శిక్షణ లేని కోట్లాది మంది ఉన్నారని, అలాంటప్పుడు నైపుణ్యాభివృద్ధి లేకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదని అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ సోషల్ మీడియాలో చేస్తున్నట్లు తాము భావిస్తున్న తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ శ్రేణులు సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి రావడానికి ఎంత కష్టపడ్డామో, ఇప్పుడు ప్రజా మద్దతును కాపాడుకోవడానికి కూడా అంతే కృషి చేయాలని సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!