

భారత్‌లో అంతరిక్ష రంగం వేగంగా రూపాంతరం చెందుతోంది. దశాబ్దాలుగా ప్రభుత్వ పరిశోధనా సంస్థలకు మాత్రమే పరిమితమైన ఈ రంగంలోకి ఇప్పుడు ప్రైవేటు కంపెనీలు, అంకుర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున ప్రవేశిస్తున్నారు. 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానపరమైన సంస్కరణలు దీనికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఇస్రో, ప్రైవేటు స్టార్టప్‌లు, విశ్వవిద్యాలయాలు, పెట్టుబడిదారులను అనుసంధానించేందుకు ఇన్-స్పేస్ ఏర్పాటైంది. ఇస్రోకు చెందిన మౌలిక వసతులు, ప్రయోగ వేదికలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రైవేటు సంస్థలకు అందుబాటులోకి తీసుకురావడంతో దేశీయ స్పేస్-టెక్ పరిశ్రమ మరింత వేగం పుంజుకుంది. రాకెట్ ప్రయోగాలతో పాటు శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్, ఆర్బిటల్ ట్రాన్స్‌పోర్టేషన్, స్పేస్ టూరిజం, ఇన్-ఆర్బిట్ సర్వీసింగ్, వాణిజ్య అంతరిక్ష కేంద్రాల వంటి విభాగాలు కూడా విస్తరిస్తున్నాయి.
అంతరిక్ష రంగం విస్తరణతో నిపుణులకు, యువ ఇంజినీర్లకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇస్రోలో పనిచేసిన అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రైవేటు సంస్థల్లో చేరడం లేదా సొంతంగా స్టార్టప్‌లు ప్రారంభించడం పెరుగుతోంది. అధిక వేతనాలు, స్టాక్ ఆప్షన్లు, వేగవంతమైన నిర్ణయ ప్రక్రియలు, పరిశోధనలో స్వేచ్ఛ వంటి అంశాలు నిపుణులను ఆకర్షిస్తున్నాయి. స్కైరూట్ ఏరోస్పేస్ వంటి సంస్థల విజయాలు అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో భారత ప్రైవేటు అంతరిక్ష కంపెనీలపై విశ్వాసాన్ని పెంచుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 400కు పైగా స్పేస్-టెక్ అంకుర సంస్థలు ఉన్నట్లు అంచనా. ఏరోస్పేస్ ప్రొపల్షన్, ఏవియానిక్స్, రోబోటిక్స్, మెటీరియల్ సైన్స్, శాటిలైట్ టెక్నాలజీ, రిమోట్ సెన్సింగ్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఇస్రో, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్‌లో 746 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం కూడా ఈ రంగంలో పెరుగుతున్న అవకాశాలకు నిదర్శనంగా నిలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!